నెను కూడా లెఖిని వాడాను, ఒక తెలుగు బ్లాగ్ తయ్యారు చెసాను :)
Telugu not displaying properly? Check out Tips from Wikipedia

Saturday, January 16, 2010

వరల్డ్ స్పేస్ మూగ బోయింది!


ఇంట్లో ఇప్పుడు ఒక రేసీవేర్, ఒక జత స్పీకర్స్ ఖాళీ గా పడున్నాయి!
ఆర్జే లు మ్రిణాలిని, కృష్ణ మోహన్, తదితరుల గొంతు వినిపించట్లేదు!
ఏవో కష్టాలలో ఉన్నారంట, మన డబ్బు ఏమైనా ఉన్నా ఇచ్చే పరిస్తితి లో కూడా లేరుట!
డబ్బు సంగతి పక్కన పెడితే, రోజు ఉదయాన్నే బంగారం లాంటి పాటలతో నిద్ర లేపే వరల్డ్ స్పేస్ ఇంక లేదు, ఇప్పట్లో మరి రాదు!
మళ్ళీ మన మామూలు 'FM' రేడియోలే మిగిలాయి :(
'చిగురాకుల లో చిలకమ్మా' వింటున్నప్పుడు మధ్యలో 'మన్మోహన్ జాదూ మలాం' గజ్జి మందు గురించి మళ్ళీ వినాలి!
ఎంత పని చేసారు వరల్డ్ స్పేస్! వాళ్లకి రెహ్మాన్ కంపోస్ చేసిన ట్యూన్ ఇప్పుడు యు ట్యూబ్ లో డౌన్లోడ్ చేసి వినాల్సిందే! హిందీ లో ఫరిష్తా, ఝాంకార్, ఇంగ్లీష్ లో క్లాసిక్, ఇవన్నీ మరి లేవు! డాబా మీద పెట్టిన శ్యాటిలైట్ రేడియో డిష్ ఇంక తుప్పు పట్టడమే!
మళ్ళీ 'ఉల్లాసంగా ఉత్సాహంగా' FM రేడియో వినే ప్రయత్నం చెయ్యాలి!

Tuesday, May 5, 2009

ప్రాంతీయ వార్తలు!

చదువుతున్నది మీ ప్రయాగి రామకృష్ణ. :)
ఊరికే, అలా రాయాలి అనిపించింది :)
రెగ్యులర్ గా ఇంగ్లీష్ బ్లాగ్ రాస్తూ, ఇవాళ గంభోళ జంభ చూస్తే డిసెంబర్ నుంచి ఏమీ రాయలేదు అన చూసాను! ఎందుకు అలాగా అని ఆలోచిస్తే అర్థం అయింది. డిసెంబర్ లో గూగుల్ క్రోం డౌన్లోడ్ చేశాను. అన్ని విషయాలలో అది పెద్ద కేక! కాకపోతే బ్లాగ్గింగ్ లో తెలుగు (అండ్ మిగితా భాషలు కూడా) రావట్లేదు. ఇంగ్లీష్ లో మాత్రమె బ్లాగ్ చెయ్యగలుగుతున్నాము! అందుకే మళ్ళి ఫైరుఫాక్సు కి వచ్చి పోస్ట్ రాస్తున్నా.
అందరి బ్లాగులు చదివితే భలే సందడి గా ఉంది. రాధిక గారు ఫిబ్రవరి తరువాత పద్యాలు ఏమి రాయలేదు. మన వీవెనుడి టెక్కునిక్కులు బ్లాగ్ కూడా గత నెలలో ఏమి కొత్త పోస్టులు లేవు. అందరూ వేసవి సెలవలో ఉన్నారనుకుంటా! లేక ఎలెక్షన్ రిజల్ట్స్ కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్నారో! ఓహ్! పీ ఏల్ సందడి ఒకటి ఉంది కదూ!
జల్లెడ
లో కొత్త బ్లాగులు కొన్ని కనపడ్డాయి. భలే హ్యాపీ!
కొన్నాళ్ల క్రితం మా మావయ్య హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి వీవెన్ రేడియో లో ఒక కార్యక్రమం చేసాడు అని చెప్పారు. (ఆయన నా బ్లాగ్ లో వీవెన్ సైట్ కి లింక్ చూసారు; అలా గుర్తుపట్టారు). నేను మిస్ అయినందుకు కొంచం బాధ పడ్డాను లెండి!
లోపు ఎలెక్షన్ సందడి (వేలికి ఉన్న గుర్తు ఇంకా చెరిగిపోలేదు). ఇంకోన్నల్లలో రిజల్ట్స్ సందడి. వైజాగ్ లో గత వారం లో రెండు సార్లు బుల్లి బుల్లి వర్షాలు పడ్డాయి. అదొక సందడి! అలా జరిగింది.
ఇంతే సంగతులు. మళ్ళీ రాత్రి పది గంటల వార్తలలో కలుద్దాము. నమస్తే!

Sunday, December 7, 2008

Wednesday, October 29, 2008

అప్పా రావు కాలనీ - ౩ - నంది పాడ్యమి

మన బబ్లూ గాడు గుర్తున్నాడా? (లేక పోతే ఇంతకు ముందు కథలు చదవండి)
వాడు వినాయక చవితి అయినప్పటి నుంచీ ఆలోచిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు గా వినాయక చవితి జరుపుకుంటున్నారు కదా, అది ఎవరు మొదలుపెట్టారా అని! వాళ్ల బామ్మ ని అడిగాడు, ఆవిడ శివుడు మొదలు పెట్టాడు అంది. నాన్నని అడిగాడు, ఆయన ఋషులు మొదలెట్టారు అని చెప్పారు. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని అమ్మని అడిగితే "నన్ను ఇన్వాల్వు చెయ్యకండి రావు గారూ' అంది ఆవిడ.
ఫైనల్ గా వాడు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరికీ తెలియదు అని.
ఐతే వాడికి ఒక ఆలోచన వచ్చింది. మనం కూడా ఒక పండగ కనిపెట్టి దానిని బాగా జరిపితే పాపులర్ అయిపోతాము కదా అని! ముఖ్యం గా కొన్నాళ్ళు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా!

వచ్చే ఉదయం అమ్మని, నాన్నని లేపి చెప్పాడు, "నాన్నగారు, నాకు నిన్న రాత్రి నిద్రలో నంది వచ్చింది. అది చాలా బాధ పడింది. ఇన్ని యుగాల నుంచి శివుడిని లోకాలన్నీ తిప్పుతున్నాను కదా, నాకు ఒక్క పండగ కూడా లేదా అని కంట తడి పెట్టుకుంది" అని చెప్పాడు! బామ్మ పరిగెత్తుకొచ్చి వాళ్ల నాన్నతో అంది 'ఒరేయ్ నానీ, నేను చెప్పాను కదా, చిన్నప్పుడు వీడు పుట్టిన నక్షత్రం ఎంతో దివ్యమైనది అని! చూశావా, వీడికి నంది కలలోకి వచ్చిందట!! తరచూ మీ నాన్నగారికి కూడా నంది కలలోకి వచ్చేది రాఆఆఆ!" అని బబ్లూ గాడి ప్లాన్ ని పాస్ చేసేసింది!

సాయంత్రం ఇదు సరికీ పిల్లలందరూ కలిసి చందా డబ్బాలు పట్టుకుని బయలుదేరారు కాలనీ లో, వానర సేన లంక మీద పడ్డట్టు. ఒక్కొక్క ఇంటి వాళ్ళకీ టెన్షన్! ఇప్పుడే కదా దసరా అయ్యింది, చందాల వాళ్లు ఏమైనా వదిలితే దీపావళి కి కల్చేసామాయే, ఇప్పుడు ఈ కొత్త కల్లెక్షన్ ఏంటి రా భగవంతుడా అని!
బబ్లూ గాడి వెనక పిల్లలు ఒక ఇరవై మంది బయలుదేరారు, మన కాలనీ లో ప్రపంచం లోనే మొదటి సారి గా నంది పాడ్యమి జరుపుకుంటున్నాము, మీ వొంతు చందా ఇవ్వండి అని! ఒక్కొక్కళ్ళ మొహాలూ చూడాలి! నంది పాడ్యమి ఏమిటి, చందా ఏమిటి! పిల్లలు ఇలా రామ దండు లాగా బయలుదేరడమేమిటి!
ఎలాగా ఐతే ఏమి, పిల్లల తండ్రులు అందరూ తలో చెయ్యి వేసారు.
ఇప్పుడు
వచ్చింది చిక్కు. గణపతి, దుర్గ బొమ్మలు చేసిన మార్వాడి వాడు "నాకు నంది బొమ్మ రాదు" అన్నాడు హిందీలో! పాత చందనా బ్రదర్స్ క్యాలెండర్ పట్టుకొచ్చాడు కిట్టు గాడు. అందులో నవ్వుతున్న నందిని చూపించి, "ఇదిగో, ఇప్పుడు చెయ్యి" అన్నాడు!
ఒక
వారం అయ్యాక, అమావాస్య రోజు 'ఒక రకం గా చూస్తున్న' నంది (లాంటి) బొమ్మని పిల్లలందరూ చిన్నా రావు ఆటో లో తెచ్చారు. దానికి కూడా కళ్ళకి గుడ్డ కట్టి! మరి పూజ కి ముందు తీయకూడదు కదా!
సుబ్రహ్మణ్యం గారి (చిరుత) కార్ కవర్ తీసుకొచ్చి ఒక టెంట్ లాగ చేసి, దాంట్లో ప్రతిష్ట చేసారు.

ఐతే, అయ్యప్ప కోవెల లో కేరళా పంతులు గారికి నంది పూజ రాదుట! బామ్మ అతన్ని భీబత్సమైన తిట్లు తిట్టింది! ఆయన కూడా ఏవో మలయాళం లో అన్నాడు, పాపం పారిపోయాడు!
కిట్టు గాడు చాలా సరైన వాడు. సరిగ్గా మళయాళ మాంత్రికుడు పారిపోయే సమయానికి చెప్పాడు - బామ్మగారూ, మా బాబాయి చిన్నప్పుడు ఉన్న వేదాలన్నీ భయంకరం గా నేర్చుకున్నాడు అని అందించాడు. అంతే! వామ్మో వారి నాయనో అని విలపిస్తున్నా వినకుండా బామ్మ గారి ఆజమాయిషీ లో పిల్లలు అందరు కలిసి కిట్టు గాడి బాబాయి ని ఎత్తుకోచ్చారు! "ఎలాగో ఉద్యోగం లేదు కదా రా, నంది పూజ చేస్తే బిల్ గేట్స్ ఉద్యోగం వస్తుంది అని కేనోపనిషద్ లో ఉంది" అందావిడ. మరేమి మాట్లాడతాడు? కష్టపడి పంచ కట్టుకుని, (అది జారిపోకుండా లోపల బెల్ట్ పెట్టుకుని) నామాలు పెట్టుకు వచ్చేడు.

ఒహొ! ఏమి పూజలనుకున్నారూ? బాబాయి మంత్రాలు గబ గబా చదివేస్తున్నాడు (మరి .....) నంది పాడ్యమి అన్నా విషయం తెలిసే సరికి పక్కన ఉన్న కాలనీ వాళ్ళూ, చుట్టాలూ అందరూ వచ్చేసారు ! హుండీ నిండింది!

మరసటి రోజు నిమజ్జనానికి మళ్ళీ చిన్నా రావు ఆటో, బాబాయి మంత్రాలు (ఇప్పుడు కొంచం గట్టిగా చదివేడు లెండి - అలవాటు అయ్యింది కదా!), వెనకాల బబ్లూ గాడు 'మాయదారి మైసమ్మ' పాటలు, డాన్సులు, భలే అయ్యింది లెండి!

సంవత్సరం తిరిగింది. బాబాయి కి నిజం గా అమెరికా లో ఉద్యోగం వచ్చింది, బబ్లూ గాడు అన్ని సబ్జేక్టులలో భలే గా పాస్ అయ్యాడు. కాలనీ కి మంచి నీటి పంప్ ఇంకొకటి బిగించారు, రోడ్లు మరమ్మతు చేశారు.
అంతా నంది పాడ్యమి మహిమ అని ఈ సారి బబ్లూ గాడు చందా డబ్బా తియ్యకుండానే అందరూ ముందుకొచ్చారు!

ఈ సారి మార్వాడి వాడి బొమ్మలో నంది నవ్వింది.

Friday, September 12, 2008

గణపతి బప్పా మోరియా!

మా ఆఫీసు లో మాతో పని చేసే ఒక కుర్రాడు మొన్న వినాయక చవితి పండల్ పెట్టామని పూజకి పిలిచాడు.
అన్ని ఊర్లలో లాగా వైజాగ్ లో కూడా సందుకి నాలుగైదు పోటీ పడి మరీ పెట్టిన బొమ్మలు ఉన్నాయి. ఐతే ఈ సంవత్సరంవాళ్ల ఏరియా లో పెద్ద బొమ్మ వీళ్ళదే. ఒక ఇరవై అడుగుల పైన ఉన్నాడు గణపతి. ఎలక ఐదారు అడుగులు ఉంటుంది!

అంత బొమ్మ పెట్టినందుకు దానికి తగ్గ సరంజామా కూడా చేసారు లెండి. అడిగితే క్రేన్ తో తెచ్చామన్నారు. పెద్ద పెద్ద స్పీకర్లు, రావడానికి ఒక దారి, వెళ్లడానికి ఒక దారి, లోపల ఫోకస్ లైట్లూ, ఫ్యాన్లూ, ఒకటేమిటి, చాలా బాగుంది సరంజామా.

పూజ
అయ్యాక, శ్రీధర్ (మా వాడు) తో చెప్పాను భలే ఉంది రా, సూపెర్ గా చేసారు అని. ఇంకా చేద్దామనుకున్నమండీ, ఇంతకన్నా పెద్ద బొమ్మ దొరకలేదు అన్నాడు! ఒరేయ్, ఈ సందులో ఇదు బొమ్మలు ఉన్నాయి కదా, ఇంత డబ్బులు ఈ ఏరియా వాళ్ల దెగ్గర ఎలా కలక్ట్ చేసారు అని అడిగితే నవ్వి, ఇక్కడ చందాలు తీసుకున్నది చాలా తక్కువండీ, మొత్తం పార్టీల వాళ్ళే ఇచ్చారు అన్నాడు!

శ్రీధర్ ఉవాచ - ఫలానా చిరంజీవి పార్టీ వాళ్లు ఇరవై వేలు ఇచ్చారు, ఇదేదో బాగుంది కదా అని అనుకుంటే, తెలుగు దేశం వాళ్లు వచ్చి వీళ్ళ బ్యానర్ కాదు, మాదీ కట్టండి అని వాళ్లు ఇరవై వేళ ఒక్క రూపాయి ఇచ్చారు!
వీళ్ళకి ఇదేదో బాగుంది అని ఆ ఏరియా కార్పోరేటార్ దేగ్గిరకి వేల్లారంతా, ఆయన (మీరనుకున్నట్టే) కాంగ్రెస్ మనిషి. అతను టెంట్ కి, స్పీకర్ సెట్ కి, మైక్లకి, లైట్లకి అయ్యే ఖర్చు పెట్టుకుంటా అన్నాడు!

అంతే
! ఇరవై వేలు పెట్టి బొమ్మ, రోజు సంత్రపణలు, పూజలూ, ప్రసాదాలూ, ఓహో, ఏమి ఆర్భాటం గా చేసారనుకున్నరూ!! తలో వైపూ ఒక్కో బ్యానర్ కట్టేశారు.

గణపతి
కి అందరూ ఒకటే కదా!

జనాలందరూ హ్యాపీ! అన్ని పార్టీలు అన్ని వర్గాలు కలిసి చేస్తున్న వేడుక కదా! గొడవలు లేవు, బాధలు లేవు!

మిగిలిన డబ్బులతో నిమజ్జనం అయ్యాక ఏదైనా మంచి పని చేద్దామని డిసైడ్ అయ్యారు ఆ బాచ్ అందరూ.
అప్పుడే మా వాడు వచ్చే సంవత్సరానికి లెక్కేస్తున్నాడు!

గణపతి బప్పా మోరియా!

Wednesday, June 25, 2008

కొంచం ఆలోచించండి!

నిన్న మద్యాహ్నం మా ఇంటి పక్కన ఇస్తిరీ బండి వాడు, ఆటో డ్రైవర్ మధ్య సంభాషణ చొక్కా ఇస్తిరీ చేయించుకుంటున్న నేను వినడం జరిగింది.
ఈ మధ్య జరిగిన మునిసిపల్ ఎన్నికలలో వాళ్ల వార్డ్ అభ్యర్ధి ఒకాయన 'నన్ను గెలిపించండి' అన్న కాగితాన్ని ఇంటింటికీ తిరిగి పంచాడుట. దానితో బాటు ఒక ఇదు వందల కాగితం పిన్ చేసి మరీ పంచాడుట.
మనం ఇక్కడ ఒక సాధారణ 'Corporator' ఎన్నిక గురించి మాట్లాడుతున్నాము. అలాగ ఎంత మందికి పంచాడో తెలియదు కానీ, చాల మందికి ఇచ్చే ఉంటాడు! నా ఆశ్చర్యం చూసి వాళ్లు నవ్వుకున్నారు. ఇది చాల మామూలు విషయం బాబూ. ప్రతీ సారీ జరిగేదే అన్నారు.
ఆలోచించాను - ఎన్నికలలో గెలిస్తే అతని జీతం ఎంత ఉంటుంది?? మహా ఐతే ఇరవై వేలు. అంతేనా? పెద్ద పెర్క్స్ కూడా ఉండవు కదా. ఏ ధైర్యం తో ఆయన ఆ లక్షల రూపాయిలు గుమ్మరించాడు?? అతను ఖర్చు పెట్టిన డబ్బు పార్టీ ఫండ్ లోది కాదు. అండ్ ఆయన పదవి లో పూర్తి ఇదు సంవత్సరాలు ఉన్నా అది వెనక్కు సంపాదించే మార్గం (లీగల్ గా) లేదు. సో, ..........
మనం లంచగొండితనం ఎక్కువయిపోయింది అని, కరప్షన్ పెరిగిపోయింది అని, అవినీతి అంతం లేకుండా పోతోంది అని పెద్ద పెద్ద మాటలుమాట్లాడతామే, ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు?? కార్పొరేటర్ దెగ్గిర నుంచి ఎం.పీ దాకా, కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకోవడం లేదు?? ఖర్చు పెట్టిన మొత్తం వెనక్కి తెచ్చుకొనే ప్రయత్నం లో వారి బాధ్యతలు మరిచిపోయిన తరువాత మనకి సడన్ గా మెలుకువ వచ్చి, వచ్చే ఎన్నికలలో వేరే పార్టీ వాళ్ళకి పట్టం కట్ట బెడతాము. మళ్ళీ కథ మొదలు!!
ఇదే ప్రజాస్వామ్యం కదా!!
సామాన్యుడిని మనం అడగలేము. వాడికి ఆ రోజు కి ఇదు వందలు వస్తే ఇంటిల్లిపాది కడుపు నిండా తింటారు! సో, వాడు ఎందుకు 'నో' అంటాడు?
ఎప్పటికి వస్తుంది మార్పు?? ఎవరు తెస్తారు? మన దేశం లో అవినీతి విలువ లక్షల కొట్లలో ఉంది. ఆ మొత్తం దేశానికి ఉపయోగ పడితే మనం పేద దేశం కానే కాదు. ఎవరు చేస్తారు ధైర్యం??
యువత రాజకీయాలలోకి రావాలి అని అందరూ అంటారు, ఓ నలుగురు కుర్రాళ్ళు పార్టీ లోకి వస్తే ఏమి ఉపయోగం? సిస్టం వాళ్ళని కూడా మార్చేస్తుంది! మరి ఏది దారి??
కొంచం ఆలోచించండి!

Wednesday, June 18, 2008

శివమణి - ఇళయరాజా - సూపర్!!


శివమణి ని మొట్ట మొదట గుర్తించినది ఇళయరాజా అన్నది తెలిసిన విషయమే. ఆయనని ఇవాల్టి సూపర్ స్టార్ గా తయ్యారు చెయ్యడం లో ఇళయరాజా పాత్ర చాలా ఉంది.
చెన్నై లో ఇళయరాజా మ్యూజిక్ షో లో పాల్గొని ఆయన ఒక చిన్న గురు దక్షిణ సమర్పించాడు.
ఖచ్చితం గా చూడాల్సిన వీడియో!

ఇది ఎవరు పోస్ట్ చేసారో నాకు తెలియదు. నెట్ లో దొరికింది, నేను ఇక్కడ పెట్టాను. మొదట పెట్టిన వారికి, తయ్యారు చేసిన జయ టీవీ వారికి చాలా థాంక్స్!

Saturday, June 7, 2008

అబ్బాయిలు అబ్బాయిలే!

ఇంకేమిటి మారేది? చిన్నప్పటినుంచి మరి బుద్ధులు అంతే!! పెద్దయ్యాక ఎలా మారుతాయి??? ;)
(ఆ పిల్ల సిగ్గు పడడం చూడండి!)
ఈ ఫోటో నాదే కాడు. మెయిల్ లో పంపిన శశాంక్ కి థాంక్స్.

Wednesday, June 4, 2008

బుజ్జి గాడు - made from పోకిరి, మనసంతా నువ్వే, etc!

మంచి తెలుగు సినిమా చూసి చాల రోజులు అయ్యింది!
సో, నిన్న రాత్రి రెండో ఆటకి బుజ్జి గాడు చూద్దామని వెళ్ళాం. మా వాడు ఒకడు ఈ సినిమాని ఇప్పటికి మూడు సార్లు చూసాడు! దానితో ఇదేదో సూపర్ అని వెళ్లి కాసేసాము!
బాబోయి!!!
నాకు ఊహ తెలిసి చూసిన అవకతవక కంగాళీ భాషుం సినిమాల్లో ఇదొకటి!!! అంటే జాని, డాన్, అలాంటి కోవకు చెందిన సినిమా అన్నా మాట!!
మీరు 'జై చిరంజీవ' చూసి ఉంటే మీకు 'ఇది విజయభాస్కర్ తీయలేదు, ఎవర్నో పెట్టి తీయంచి వాడి పేరు ' పెట్టుకున్నాడు అని అనిపిస్తుంది, అవునా?
ఇందులో సేం ఫీలింగ్, పూరీ జగన్నాథ్ తో.
ఇది
మామూలుగా జరిగేదే లెండి - ఒక భీబత్సమైన హిట్ తరువాత డైరెక్టర్ కూడా ఏదో ఖుమ్మేద్దామని ట్రై చేస్తాడు, 'డ్హాం' అనిపోతుంది సినిమా!
ఇదేదో పోకిరి పార్ట్-2 లాగ బోలెడు తుపాకీలు, ముమయిత్ ఖాన్ తో ఒక పాట, ఎవర్నీ ఖాతరు చెయ్యని హీరోని పెట్టి కధ లేకుండా నడిపించేద్దాము అనుకుంటే, మరి ఇలాంటి సినిమాలే వస్తాయి!
మొట్ట మొదటిగా పాటలు బుస్స్స్స్! సగం సినిమా లైఫ్ పోయింది! ఎండ్ బోలెడు పాటలు పెట్టేసారు!
బాగా బీటింగ్ మాష్టారు :)
ఏదో సినిమా లో ఆలి, m s నారాయణ , కామెడి లాగ 'మనసంతా నువ్వే కథ ని 'గుండంతా నువ్వే' అని చెప్తే తెలుసుకోలేనంత వేర్రోడి లాగ కనబడుతున్నాన' న్నట్టు ఏవో మూడు సినిమాలు కలిపి కొత్తరకంగా చూపిస్తే జనాలు మళ్ళీ చొక్కాలూ, వీలైతే బనీన్లు కూడా చింపుకొని చూస్తారు అంటే పొరపాటే!
ఐతే కొన్ని మంచి కూడా ఉన్నాయి లెండి - తీసే విధానం, తేరా పైన చూపే విధానం కొత్త గా ఉన్నాయి. స్పెషల్ గా ఒక రెండు పాటలైతే భలే తీసారు.
మోహన్ బాబు క్యారెక్టర్ వేస్ట్. రెండో హీరోయినే క్యారెక్టర్ వేస్ట్. కోట క్యారెక్టర్ మరీ వేస్ట్. m s నారాయణ, ఆహుతి ప్రసాద్, సుధ పాత్రలైతే మరీ వేస్ట్! అందరికన్నా మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఘోరం!! 'నిన్నే పెళ్ళాడతా' లో అద్భుతమైన పాటలు అందించినది ఈయనేనా అనిపిస్తుంది ఈ దిక్కుమాలిన పాటలు వింటే!
తలా తోకా లేకుండా సినిమా తీసినందుకు పూరీ జగన్నాథ్ కి జై!
చూస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు జై జై!

My Rating - 2/5

మీరు కూడా చూసి ఉంటే ఇక్కడ ఒక కూత కుయ్యండి! :)

Monday, June 2, 2008

ఒక సాధారణ కథ

మనం మామూలుగా 'సక్సెస్ స్టోరీస్' అంటే ఏ బిల్ గేట్స్ నో లేక ఏ ప్రేమ్జీ నో చూస్తూ ఉంటాము.
నిజమే, వాళ్ళ జీవితం ఆదర్శప్రాయం.
ఐతే నాకు మొన్న ఒక సాధారణ మనిషి కథ ఎంతో బాగా అనిపించింది.
ఆయన పేరు రాములు. ఊరు శ్రీకాకుళం అవతల ఏదో చిన్న పల్లెటూరు.
నాలుగో క్లాస్ దాకా చదివిన ఆయినా ఆ తరువాత పొలాల్లో పనికి వెళ్ళడం మొదలు పెట్టారు.
ఐతే వర్షం పడక ఉన్న రెండెకరాల భూమి అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
పెద్దగా డబ్బులు ఏమి రాలేదు, కానీ తప్పదు. తినాలి కదా అన్నారాయన, మొన్న నా తో మాట్లాడుతూ.
ఈ లోపు జబ్బు చేసి తల్లి పోయింది. తండ్రికి పని లేక తాగుబోతు అయ్యాడు. ఇంకొన్నాళ్ళకి ఆయన కూడా పోయాడు.
ఇద్దరు చెల్లెళ్ళు. కష్టపడి ఒక దానికి తండ్రి ఉండంగానే పెళ్లి చేసారు. రెండో చెల్లిని తీసుకొని రాములు వైజాగ్ వచ్చేడు.
ఇక్కడ ఒక రైల్వే కాంట్రాక్టర్ దగ్గర కలాసి గా చేరాడు. ఆ డబ్బుల తోటే చిన్న చెల్లి కి పెళ్లి కూడా చేసాడు.
కాంట్రాక్టర్ మంచాయనట . ఆ సంవత్సరం రైల్వేస్ లో గ్యాంగ్ మాన్ పోస్టులు పడితే దానికి రాములు ని అప్లై చెయ్యమని చెప్పి, ఎవరో ఫై అధికారులకు కూడా సిఫార్సు చేసాడు.
దానితో రాములు రైల్వేస్ లో పెర్మనెంట్ అయ్యాడు.
రైల్వేస్ లో ఉద్యోగం రాంగానే ఊరి నుంచి సంబంధాలు వచ్చేయి! దూరపు చుట్టాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఒక చిన్న ఇళ్లు కూడా కట్టుకున్నాడు.
రాములు మాటలలో ఒక గర్వం ఉంది. దానికి కారణం ఇన్ని సంవత్సరాలలో ఆయన ఒక్క సిగరెట్ గాని చుక్క మందు కాని ముట్టుకోకపోవడమే! తండ్రి తాగుబోతు అవ్వడం తో వచ్చిన కష్టాలు ఆయన మరచిపోలేదు!
రాములు కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. ఆయన గర్వం గా ఇంకో విషయం చెప్పాడు. కూతురు పుట్టంగానే ఆయన వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నాడు! నాకు ఈ విషయం విని భలే ఆనందం వేసింది!
పిల్లలతో బాటు రాములు, ఆయన భార్య కూడా మెట్రిక్ కట్టి పాస్ అయ్యారు!
పిల్లలు పెద్ద వాళ్ళ అయ్యారు, రాములు కూడా డబ్బు దాచుకున్నాడు.
వాళ్ల ఇంటి పక్కనే ఇంకో రెండు ఇళ్లు కూడా కట్టి అద్దెకు ఇచ్చేడు.
పెద్ద వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, అమ్మాయికి కంప్యూటర్స్ నేర్పించేరు.
ఇవాళ కొడుకూ, కూతురూ ఇద్దరూ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగం లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మాయికి పెళ్లి అయిపొయింది, ఆల్ హ్యాపీస్.
మొన్న కొత్తగా మన రైల్వే స్టేషన్ లో ac వెయిటింగ్ హాల్ ఒకటి ప్రారంభించారు. దానికి ఇన్ఛార్జ్ గా రాములు ని పెట్టారు. 25 సంవత్సరాల తరువాత రాములు కి దక్కిన రికగ్నిషన్ ఇది. గత వారం హైదరాబాద్ వెల్తునప్పుడు కొంచం సేపు అక్కడ వెయిట్ చేసాము. అప్పుడు రాములు పరిచయం అయి చెప్పిన కథ ఇది. ఆయన మాటలలో వింటే ఇంకా బాగుంటుంది!
ఎక్కడో ఎండలలో కూలి పని చేసుకునే నాకు రోజంతా ac గది లో కూర్చునే ఉద్యోగం చూపించిన దేముడికి పెద్ద థాంక్స్! అన్నాడు అతను.
అప్పుడు అనిపించింది - ఇది మంచి 'సక్సెస్ స్టొరీ' కాదా?? అని.

Thursday, May 29, 2008

జై పాండురంగ!!

నిజం చెప్పాలంటే పౌరాణిక పాత్రలలో బాలకృష్ణ నాకు భలే ఇష్టం! పాండురంగడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
కానీ ఈ మెయిల్ శశాంక్ నాకు పంపాక ఇక్కడ పెట్టకుండా ఉండలేకపోతున్నాను!!
తనివితీరా నవ్వుకోండి!
______________________________________________________________________

పాండురంగడు ఆడియో రిలీజ్ కే ఇలాగ ఐతే సినిమా రిలీజ్ కి ఏమవుతుందో???
























































ఈ ఫోటోలు నావి కావు. తీసిన వారికి థాంక్స్!!

Wednesday, May 28, 2008

సర్కస్ సందడి.

అబ్బ! ఇన్నాళ్ళకి వైజాగ్ లో సర్కస్ చూసే అవకాశం వచ్చింది!
గత నాలుగు సంవత్సరాలలో మూడో నాలుగో సర్కస్ లు వైజాగ్ వచ్చేయి, కాని చూద్దాము అని డిసైడ్ చేసే లోపలే వెళ్ళిపోయాయి!! ఇప్పుడు ఉన్నది కూడా ఎల్లుండి వెళ్ళిపోతోంది :)
ఐతే ఈ సారి చూసాము లెండి! నిన్న సాయంత్రం.
ఎన్ని పాత స్మృతులు! భలే భలే జ్ఞాపకాలు!
ఒక పదిహేను సంవత్సరాల క్రితం (అప్పటికి నేను ఏడో క్లాస్ అనుకుంటా) బందర్ లో సర్కస్ చూడడం జ్ఞాపకం. మళ్లీ నిన్ననే!
చిన్నప్పుడు 'Mr Galliano's Circus' అని Enid Blyton రాసిన పుస్తకం ఒకటి చదివేను. అప్పటినుంచీ సర్కస్ అంటే ఏదో తెలియని అభిమానం. మీలో ఎవరైనా ఆ పుస్తకం చదివి ఉంటే ఇక్కడ ఒక కామెంట్ వదలండి.
సర్కస్ లోపల వాళ్ల జీవితాలు, వారి ఆనందం, అంతా ఆ పుస్తకం లో బ్లయ్టన్ భలే రాసేరు.
నిన్న వెంటనే అదే గుర్తొచ్చింది!
మీరు కమల్ హాసన్ సినిమా విచిత్ర సోదరులు చూసే ఉంటారు కదా, నిన్న సర్కస్ లో మరుగుజ్జు జోకర్లని చూస్తే ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది. సర్కస్ లో వారి జీవితాలు భలే వెరైటీ కదా! అదొక వేరే ప్రపంచం!
నిన్న ఇంకొకటి అనిపించింది, అక్కడ జింనాస్టులు, గారడి వాళ్ళను చూసినప్పుడు, వీళ్ళని ఒలింపిక్స్ కి పంపితే మన దేశానికి కొంచం అయినా పరువు దక్కుతుందేమో అని!
ఇద్దరు అమ్మాయిలు తుపాకీలు పట్టుకుని అంత దూరంలో ఉన్నా బలూన్లను సునాయాసంగా కొట్టేశారు! వెనక్కి తిరిగీ చిన్న అద్దంలో చూసి మరీ గురిపెట్టి కొట్టేరు! వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తే ప్రపంచ స్థాయి క్రీడాకారినిలు ఖచ్చితంగా అవుతారు!
మరో భలే విషయం ఏమిటంటే నిన్న సర్కస్ లో నలుగురు రష్యన్ అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. వాళ్ళే కాక నేపాలీలు, పకిస్తానీలు, సింగపూర్ వాళ్లు, శ్రీ లంక వాళ్లు, ఆస్ట్రేలియన్ అమ్మాయి, ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయి, ఎందరో! మన దేశం నుంచి కూడా వీరే వీరే ప్రాంతాల వారు ఉన్నారు! అదొక మినీ-ప్రపంచం!
కొందరు ఇంకా మీసాలు రాని పిల్లలైతే మరి కొందరు సర్కస్ లో పుట్టి పెరిగి జుట్టు నేరిసిపోయన వాళ్లు!
అక్కడి జంతువులు కూడా ఎన్నాళ్ళ నుంచో ఆ సర్కస్ లో భాగం గా ఉండిపోయాయి! (ఈ మధ్య ప్రభుత్వ చర్య వల్ల పులులూ సింహాలూ లేవు లెండి. ఏనుగులు, గుఱ్ఱాలు, కుక్కలు, ఒంటెలు, చిలుకలే ఉన్నాయి)
ఒక వూరు అని కాకుండా దేశం అంతా ప్రయాణం చేస్తూ 'నోమాడ్' ల లాగ జీవించే సర్కస్ వారిని చూస్తే వెంటనే చక్రాలు తిరుగుతాయి, పాత కాలం లోకి వెళ్ళిపోతాం కదు!
ఈ స్పీడ్ కాలం లో కూడా ఎంతో కష్టపడి సర్కస్ నిర్వహించడానికి సాహసిస్తున్నవారికి హృదయపూర్వక అభినందనలు!
ఈ సారి సర్కస్ వచ్చినప్పుడు ముందే వెళ్ళాలి!!!

మీరు చూసిన సర్కస్ లో మీకు బాగా గుర్తొచ్చే అంశం ఏదైనా ఉంటే ఇక్కడ కామెంట్ వదలండి!

Monday, May 5, 2008

ఇది చాల హాట్ గురూ!

ప్రతీ తెలుగు వాడూ గర్వంగా చదవాలి!! బొమ్మ మీద క్లిక్ చెయ్యండి - ఫుల్ స్క్రీన్ వస్తుంది!
ఎంజాయ్!! (ఎవరో అడిగినందుకు చెప్తున్నా - తెలుగు సంస్కృతం నుంచే వచ్చింది - వివరాలకు కామెంట్స్ చదవండి!)

Sunday, May 4, 2008

జాటర్ డమాల్!

మీకు తెలుసు, నేను రోజుకొక తెలుగు చిత్రం ఈ బ్లాగ్ లో పెడుతూ ఉంటాను.
ఇవాల్టి బొమ్మ కోసం బాపు గారి చిత్రాలు కొన్ని చూస్తూ ఉంటే బుడుగు కనబడింది.
వెంటనే చక్రాలు తిరిగాయి, ఒక పది, పదిహేను సంవత్సరాల క్రితానికి వెళ్ళాను.
చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు చదవడం అలవాటు అయిపొయింది. దానితో తెలుగు సాహిత్యానికీ బాగా దూరం అయ్యాను. (ఇప్పటికి కూడా నేను తెలుగు సాహిత్యం పెద్దగా చదవలేదు!) ఐతే ఆ టైం లో అమ్మ కి ఒక భీబత్సమైన ఐడియా వచ్చింది. నా పదో క్లాస్ సెలవలలో అనుకుంటా, ఇక్కడ ప్రహ్లాద కళ్యాణ మండపం లో నవయుగ వారి పుస్తక ప్రదర్శన జరిగింది. అమ్మ నాతో బుక్ ఎగ్జిబిషన్ అని చెప్పి పట్టుకెల్లింది. తెలుగు అని చెప్పలేదు!
అక్కడికి వెళ్ళాక బాపు రమణ గార్ల సెక్షన్ ఒకటి ఉంది. తిన్నగా అక్కడికి పట్టుకెళ్ళి బుడుగు కొంది!
అది ఒక నెల పాటు బుక్ రాక్ లో ఉంది! ఒక రోజు బోరు కొట్టి ఇంకేమి పుస్తకాలు కనబడక బుడుగు మొదలు పెట్టాను! ఇప్పటికీ నాకు పుటకం మొదలు గుర్తే!
'నా పేరు బుడుగు, ఇంకో పేరు పిడిగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు'
మీలో దాదాపు అందరూ ఈ పుస్తకం చేదివే ఉంటారు! సో, ఈ వాక్యం చదవంగానే మీకొక చిన్న చిరునవ్వు వచ్చే ఉంటుంది!! కదూ!
జాటర్ డమాల్, సీ గాన పెసూనాంబ, బాబాయి, సీత జడలు ( వేల్తోందో వస్తోందో అర్థం అవ్వనివ్వని జడలు!)
మద్రాస్ కట్టింగ్ షాపు, గాట్టిగా ప్రైవేటు చెప్పెయ్యడం, భలే స్మృతులు!
మీరు బుడుగుని పుస్తకం రూపం లోనే చదవాలి! ఒక వేళ ఇంతకు ముందు చదివి ఉంటే, సరదాగా తిరగేయ్యడానికి ఇక్కడ ఒక ఈ-కాపీ ఉంది, సరదాగా చూడండి.
నేను మాత్రం ఇవాళ వెళ్లి మళ్లీ బుడుగు కొన్నుక్కోచ్చా! :)

మసాలా క్రికెట్!!

బొమ్మ కీ క్రికెట్ కీ ఏమిటి సంబంధం?
ఉందండీ! మధ్య క్రికెట్ కూడా ఒక తమాషా అయిపొయింది గా!
నేను కొత్త T20 ఒక్క దాని గురించే మాట్లాడట్లేదు.
రకం ఆట మంచిందే! ఆట అభివృద్ది కీ తోడ్పడే కొత్త ప్రయోగం అయినా మంచిదే. కానీ అది ఆతని దిగజార్చేది అయి ఉండకూడదు.
అయితే ఏన్కర్ల విషయమే కొంచం ఇబ్బంది గా ఉంది!!
మీరు క్రికెట్ అభిమానులైతే మీకు కూడా చాల బాధాకరంగా ఉండుంటుంది విషయం!
మొదటి నుంచీ మనకి మంచి క్వాలిటీ కామెంటరీ, ఆట కి సంబందించిన యాంకరింగ్ అలవాటు అయిపోయాయి గవాస్కర్, హర్షా భోగ్లె, రవి శాస్త్రి, శివరామక్రిష్ణన్, డీన్ జోన్స్, టోనీ గ్రెగ్, రమీజ్ రాజా గొంతులు మనకి అలవాటు అయిపోయాయి!
ఇన్నాళ్ళు క్రికెట్ కేవలం ఆటలకి సంబంధించిన టీవీ చేనేళ్ళలో వచ్చేది కదా. చేనేళ్ళకి క్రికెట్ చాల సీరియస్ విషయం. అందుకని నిజంగా ప్రొఫెషనల్ గా షోలని రూపొందించేవారు.
గత రెండు సంవత్సరాలుగా సోనీ, మాక్స్ లాంటి మసాలా చేనేళ్ళు కూడా క్రికెట్ కోసం యత్నాలు చెయ్యడం తో ఆటను చూపించే తీరే మారిపోయింది!!
సోనీ మొదట మందిరా బేడి కీ వింత బట్టలు వేసి క్రికెట్ నేర్పించి మరీ ఒక కొత్తవిధం గా ఆటను చూపారు. విషయం అడిగితే సోనీ వాళ్లు మేము ఆటను పై స్థాయికి తెసుకువెల్తున్నాము, దీనిని కేవలం ఒక ఆట లాగా కాకుండా ఒక పూర్తి ఎంటర్టయిన్మెంట్ ప్యాకేజీ గా రూపొందిస్తున్నాము అన్నారు! అంటే అమెరికా లో రుగ్బి ని కూడా ఒక ఆటగా కాకుండా ఒక పూర్తి ఎంటర్టయిన్మెంట్ ప్యాకేజీ గానే రూపొందిన్చేరు. అందులో భాగంగానే చీర్లీడర్లు ప్రాచుర్యం లోకి వచ్చేరు! ఐతే అక్కడ అది బ్రేకుల లో మాత్రమే. ఆట కన్నా మసాలాకి ఎక్కువ విలువ ఉండదు. ఉండకూడదు!
కనీ మన వాళ్లు క్రికెట్ ని దిగాజార్చే స్థాయికి తీసుకెళ్ళారు!
కొత్త టోర్నమెంట్ లో టీవీ యాన్కర్లని చూసారా?? వాళ్ళకి క్రికెట్ షో ఇచ్చిన వాడిని తన్నాలి!
పాపం జడేజ! బలవంతం గా మిగితా వాళ్ల లాగ మసాల కబుర్లు చెప్పే స్థాయికి అతన్ని కూడా దించేసారు!
నాకు ఇప్పటికి కూడా గుర్తు - వరల్డ్ కప్ అయినప్పుడు మ్యాచ్ మొదలయ్యే రెండు గంటల ముందు టీవీ ముందు కూర్చునే వాడిని - భోగ్లె, గవాస్కర్ మాటలు వినడానికి.
ఇప్పుడు మ్యాచ్ మొదలయ్యే 2 నిమిషాల ముందు టీవీ పెడుతున్నాము!!
మీరే చెప్పండి, క్రికెట్ ని ఏదో సీరియల్ లాగ చూపించడం వల్ల దాని విలువ తగ్గించేయట్లేదు?
పాపం, ఇంటర్వ్యూ లకి క్రికెటర్లని పిలిచి అడుగుతున్నా ప్రశ్నలు చూస్తే నాకే బాధగా ఉంది!! అవి అసలుకి సినిమా వాళ్ళని అడిగే ప్రశ్నలు! మీకు ఇష్టమైన రంగు ఏమిటి? ధోని హెయిర్ స్టైల్ మీద మీ అభిప్రాయం ఏమిటి? చొక్కా మీద నెంబర్ మారేక వేణుగోపాల్ ఆట అధోగతి పాలయ్యింది కదా?
ఏమిటివి?? అసలు అర్థం ఉందా??
మీరేమంటారు ?

Thursday, May 1, 2008

గూగుల్ ప్రభంజనం!

ఇంటర్నెట్ వచ్చిన తరువాత ప్రపంచం లో ఎన్నెన్నో మార్పులు వచ్చేయి!
గూగుల్ వచ్చే ముందు ఇంటర్నెట్ ఒకలా ఉంటే అది వచ్చేక ఇంటర్నెట్ పూర్తిగా మారిపోయింది!
ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇట్టే అందుబాటులోకి గూగుల్ తచ్చేసింది.
నేను ఇక్కడ అనడ్రికి సుపరిచితమైన గూగుల్ సెర్చ్ గురించి మాట్లాడట్లేదు.
సెర్చ్ కాకుండా ఇంక ఎన్నో ఫ్రీ సేర్విసులు ఉన్నాయి గూగుల్ లో.
అందులో ఒకటి ఈ Google Analytics. కిందటి సారి ఒక ఆర్టికల్ లో Google Analytics గురించి ఒక పోస్ట్ రాసాను. ఐతే అందులో రాయని విషయం ఏమిటంటే Analytics వాడి మన సైట్ కి వచ్చిన వాళ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చేరో కూడా తెలుసుకో వచ్చు.
ఇవాల్టికి ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి 5 రోజులయ్యింది. ఇప్పటికి

ఇండియా నుంచి 169 మంది,
అమెరికా నుంచి 150
ఇంగ్లాండ్ నుంచి 18
కెనడా నుంచి 6
సింగపూర్ నుంచి 6
బహ్రెయిన్ నుంచి 4
జపాన్ నుంచి ౩
కతార్ నుంచి 2
జెర్మనీ నుంచి 2, ఈ గంభోళ జంభ చూసారు!

బహ్రెయిన్, కతార్, జెర్మనీ లాంటి దేశాల నుంచి తెలుగు వారు వచ్చేరు అంటే భలే ఆనందం గా ఉంది కదూ!
భారత దేశం లోకి వెళ్లి చూస్తే మన ఆంధ్రా ఊరులే కాకుండా మంగళూరు, కొచ్చిన్, లాంటి పట్నాల నుంచి కూడా హిట్స్ వచ్చేయి!
అమెరికా లో 10 స్తేట్ల నుంచి హిట్స్ వచ్చేయి! ఐతే నాకు అర్థం అయిన విషయం ఏమిటంటే కాలిఫోర్నియా లో ఎక్కువగా తెలుగు వాళ్లు ఉండుంటారు, 51 మంది ఆ రాష్ట్రం నుండి వచ్చేరు. అంతే కాదు, కాలిఫోర్నియా లో అల్విసో, సక్రామెంతో, హాయ్వార్డ్, సంట క్లారా లాంటి 10 ఊరుల పేరు చూపించింది Analytics!
పైన చెప్పిన దేశాలే కాకుండా స్పెయిన్, ఇజ్రాయిల్ మరియు వియత్నాం నుంచి కూడా ఇద్దేసి తెలుగు వారు వచ్చినట్లు గూగుల్ చూపిస్తోంది! ఈ ఆర్టికల్ చదువుతున్న వారి లో ఆ దేశాల వారు ఎవరైనా ఉంటే హలో అనండి!!
ఇది ప్రభంజనం కాక మరేమిటి?? ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత సులువుగా అందిస్తున్న గూగుల్ కి బోలెడన్ని మంగిడీలు!!!

Tuesday, April 29, 2008

అప్పా రావు కాలనీ - 2- అత్తగారు -ఆవకాయ

మునుపు మన చిరుత గారి ఇంటి డాబా మీద నీడ పడేలా పెద్ద మామిడి చెట్టు ఆయన పెరట్లో ఉండేది.
ఒక సారి తిరుపతి వెళ్లి వచ్చేటప్పటికి ఆయన అత్త గారు ఆ చెట్టు సగం కొమ్మలు కొట్టించేసారు . ఎందుకా అంటే పురుగు పట్టింది అని చెప్పేరు. కానీ నిజం ఏమిటంటే ఆ చెట్టు నీడ వల్ల డాబా మీద ఎండ బెట్టిన ఆవకాయ సరిగా ఎండట్లేదు!
అత్తగారికి ఎండు ఆవకాయ ప్రాణం! ఒకప్పుడు ఆవిడకి BP వచ్చింది. కాలనీ లో ఉన్న డాక్టర్ దగ్గరకి పట్టికేలితే ఆయన ఆవకాయ మానేయ్యమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆవిడ డాక్టర్ దేగ్గరకి వెళ్ళడం మానేసింది! అంతే కాదు, ఆయనది దొంగ సర్టిఫికేట్ అని కాలనీ లో చాల మందికి చెప్పింది లెండి!
ఆవిడ రికార్డు ఏమిటంటే గత 68 సంవత్సరాలు గా మిస్ అవకుండా ఆవిడ ఆవకాయ పెడుతోంది!
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి - ఆవకాయ మాత్రం సూపర్!!! ఒక సారి తింటే, మరి 'ప్రియ' ముట్టుకోరు!
ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. అత్త గారు మాత్రం భలే ఆనందం గా ఉన్నారు లెండి!
ఒహో నా ఆవకాయ బాగా ఎండుతుంది అని.
రాజ్, సూర్యం తో బాటు ఆ గదిలో ధోని అనే ఒక జులపాల వాడు కూడా ఉంటాడు. వాడి నిజం పేరు సునీల్. ఆ జులపాల వల్ల ధోని అని పేరు పడ్డాడు. ధోని కట్టింగ్ చేయించినా వీడు మాత్రం ఇంకా సాహసించలేదు.
ఈ ధోని గాడికి ఆఫీసు లో నలుగురు ఫ్రెండులు. వాళ్లు ప్రతీ ఆదివారం ఎవరో ఒకళ్ళ ఇంట్లో సిట్టింగ్ వేస్తారు! ఈ అలవాటు చాలా రోజులనుంచి ఉంది లెండి. ఈ వారం అసలుకి గోపాల్ గాడి ఇంట్లో. కానీ వాళ్ల అన్నయ్యకి మొన్ననే పెళ్ళయ్యి ఇంటి నిండా ఇంకా చుట్టాలున్నారు. దానితో ధోని వంతు ఒక వారం ముందే వచ్చేసింది.
వాళ్ల నలుగురుతో బాటు, రాజ్, సూర్యం కూడా చేరారు. వీళ్ళిద్దరూ పాపం ఉట్టి సోడా గాళ్ళే . అలవాటు లేదుకదా మరి! చిన్నప్పుడు ఊర్లో ఆడళ్ళందరూ వాళ్ల తాగుబోతు మొగుళ్ళను చితక బాదేరు లెండి! ఆ అద్భుతమైన దృశ్యం చూసిన పిల్లల లోనుంచి ఒక్కడు కూడా ఈ జన్మకు ధైర్యం చెయ్యడు!!
హడావుడి గా స్థలం మార్చడం తో రావలిసిన సామగ్రి అంతా రాలేదు. గ్లాసులు నిండాయి, నిండుకున్నాయి. మళ్లీ నిండాయి, నాలుకకి ఏదో మిస్సింగ్ అనిపించింది!
తీరా చూస్తే సీసాలు వచ్చేయి కానీ, సరంజామా రాలేదు. తాగోబోతు రూల్స్ ప్రకారం ఒక సారి కూర్చున్నాక మళ్లీ లేవకూడదు కదా!
ఈ లోగా పక్కనే అత్తగారు ఎండబెట్టిన ఆవకాయ ముక్కలు కనబడ్డాయి! ఇక ఆగుతారా?? గిన్నె ఖాళీ!
పార్టీ భలే అయ్యింది లెండి! ఈ సారి గోపాల్ ఇంట్లో కూడా ఎండావకాయ ముక్కలే తెద్దామని డిసైడ్ అయ్యి అందరూ గుడ్ నైట్ చెప్పారు. రాజ్ సూర్యం తో 'ఇప్పుడే వస్తాను రా' అని చెప్పి కిందకి వెళ్ళాడు.
తెల్లారు ఐదు గంటలకి అత్తగారు లేచారు! లేవంగానే రాత్రి ఆవకాయ పళ్లెం కిందకి తేలేదు అని గుర్తొచ్చింది! వెంటనే పైకి ఎక్కారు. తిన్నగా వెళ్లి గది తలుపు బాది, ముగ్గురినీ లీపేసారు. 'ఏరా మీకు బుద్ధి లేదు, మీరు చదువుకో లేదు? ఇంకిత జ్ఞానం లేకుండా ఎలా పెరిగారు రా గాడిదల్లారా? బంగారం లాంటి ఆవకాయ ముక్కలు బయిట అలాగ పడి ఉంటే తీసి కనీసం లోపల పెట్టాలనిపించలేదు రా' ............. అనుకుంటూ ఆవిడ పళ్లెం తీసుకుని కిందకి దిగిపోయింది.
ధోని కి ఇంకా దిగలేదు, మామ్మగారి తిట్లు వాడికి ఎక్కలేదు!
రాజ్, సూర్యం ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు. సూర్యం రాజ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు, మళ్లీ తలుపేసుకుని ముగ్గురూ పడుకున్నారు.
------------------------------------------------------------
సంవత్సరం పక్క వీధి సుశీలమ్మ గారి ఇంట్లో ఎండావకాయి లేదు.
అత్తగారి 68 సంవత్సరాల చరిత్ర లో మొదటి సారి ఆవకాయ లో కొంచెం ఉప్పు ఎక్కువయ్యింది.

Monday, April 28, 2008

అప్పా రావు కాలనీ - 1

'వెల్కం టు అప్పా రావు కాలనీ ' అనే తెల్ల బోర్డు.
విశాఖపట్నం లో దిగంగానే సుర్యానికి స్వాగతం పలికింది ఆ బోర్డే.
ఉద్యోగం వెతుక్కుంటూ సూర్యం విశాఖపట్నం చేరాడు. అతనిది విజయనగరం అవతల సిరి పల్లె.
అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక ముసలి తాత గారు కుట్ర పన్ని వాడిని ఊరిలోంచి తరిమేసారు.
మరి తరిమెయ్యరూ ? సుర్యానికి 24 ఏళ్లు. వ్యవసాయానికి ఒళ్లు ఒంగలేదు. పోని ఏదో చదివి ఊడపీకుతాడు అనుకుంటే 4 ఏళ్లు కష్టపడి డిగ్రీ గట్టేక్కించాడు. వెంటనే కమాన్ అని ఇంట్లోంచి గెంటేసారు.
ఎగ్జామ్స్ లో సుర్యానికి స్లిప్పులు అందించిన చిన్న రావు పెదనాన్న కొడుకు రాజ్. అసలుకి రాజేశ్వర రావు అన్న మాట, పట్నం వచ్చి స్టైల్ గా మార్చేసాడు! గత 5 సంవత్సరాలనుంచి ఏదో కంప్యూటర్ కోర్సులు అంటు రెండు నెల్లకోకసారి పది వేలు పంపమని వాళ్ల నాన్నకి రంగు కాగితం మీద ఉత్తరం రాస్తాడు. ఇంక ఎన్నాళ్ళు రా అంటే 'ఏమి చెయ్యను నాన్నా , నేను నేర్చుకున్న కోర్సులు మారి పోతున్నాయి' అంటూ ఉంటాడు. ఈ సారి ఆఖరు అని సుర్యానికి ఇచ్చి డబ్బు పంపేడు వాళ్ల నాన్న. ఇది అయ్యాక ఇంకా ఉద్యోగం రాకపోతే , నల్లమల పో రా అని కూడా చెప్పమన్నాడు.
ఐతే, రాజ్ గత 5 సంవత్సరాలు వేస్ట్ చెయ్యలేదు. ముందు ముందు మీరే చూస్తారు గా! విశాఖపట్నం వచ్చినప్పటి నుంచి రాజ్ అప్పా రావు కాలనీ లో చిరుత గారి ఇంటి డాబా పైన గది లో ఉంటున్నాడు. ఈ చిరుత గారి అసలు పేరు సుబ్రహ్మణ్యం. వెలికొండ సుబ్రహ్మణ్య శర్మ. ఆయన ఇంటి బయిట చిన్న గ్రౌండ్ ఉంది. బబ్లూ గాడి నేతృత్వం లో కాలనీ క్రికెట్ టీం అక్కడే ప్రాక్టీస్ చేస్తారన్నమాట. మరి బాగా గోల చేస్తే శర్మ గారు వచ్చి పిల్లలకి క్లాస్ పీకుతూ ఉంటారు. ఒక రోజు బబ్లూ గాడికి మండి, పిల్లలందరితోను 'ఒరేయ్, అంకుల్ కి కోపం వస్తే అచ్చు చిరుత లో రామ్ చరణ్ లాగ ఉన్నారు కద' అన్నాడు! అంతే, ఆ రోజు నుంచి శర్మ గారి పేరు కాలనీ మొత్తం లో చిరుత అయిపోయింది. (శర్మ గారు బయిటకి కోపం నటించినా, లోపల ఈ ముద్దు పేరు కి హ్యాపీ ఏ లెండి!)

..........ఇంకా ఉంది.

--------------------------------------------------------------------------------------------------

ఈ కధ పూర్తిగా నాదే. బుద్ధి పుట్టినప్పుడల్లా రాస్తూ ఉంటా! బోలెడు పార్టులు ఉన్నాయి! కమింగ్ సూన్!
ఆదిత్య

వామ్మో!

నా ఇంగ్లీష్ బ్లాగ్ ని నేను మూడు సంవత్సరాల నుంచి రాస్తున్నాను! గత నాలుగు నెలలుగా భీభత్సం గా రాస్తున్నాను! అందులో Sponsored పోస్టులు Paid పోస్టులు ఒకటేమిటి! ఆ బ్లాగ్ కి వచ్చి పోయే వాళ్లు ఎంత మందో తెలియడానికి దాంట్లో Google Analytics పెట్టాను. ఇవాల్టికి దాదాపు 1450 మంది వచ్చేరు. ఐతే ఒక రోజులో 40 మందికి మించి ఏ రోజూ వచిన పాపానికి పోలేదు!
సరదాగా ఈ గంభోళ జంభ మొదలుపెట్టి ఉత్తుత్తినే దీనికి కూడా Google Analytics పెట్టాను.
వామ్మో! వారి నాయనో! ఒక రోజు లో 124 మంది! నిజంగా భలే అనిపించింది లెండి!
ఇంగ్లీష్ లో చాల బ్లాగులు చూస్తూ ఉంటాము కాని ఇవాళ నేను చూసిన తెలుగు బ్లాగులు మాత్రం భేష్!!!
వాటిలో కొన్నిటిని మీ కుడి వైపు కనబడే ' అద్భుతమైన కొన్ని బ్లాగులు' అనే లింక్ లో పెట్టాను. మీకు కూడా తెలిసిన మంచి తెలుగు బ్లాగులు ఉంటే చెప్పండి. తప్పకుండ చేరుస్తా!
నా కొత్తదనాన్ని (చేత్తదనాన్ని) మన్నించి, మంచి మంచి సూచనలు ఇచ్చిన వాళ్ళందరికీ బోలెడు థాంక్స్! వీవెన్, వికటకవి, అందరికీ!!
కాక పోతే నాదొక ప్రశ్న.
నేను తెలుగు బ్లాగ్ మొదలడదామనుకున్నప్పుడు మొదట 'అబ్బ డబ్బ జబ్బ" అనే పేరు వెతికాను. బ్లాగర్ తిట్టింది! ఒరేయ్, ఆ పేరు అప్పుడే ఎవరో తీసేసుకున్నారు అని! వెతికితే భూమిక రాసిన మొదటి పోస్ట్ కనబడింది.
భూమిక గారూ, సరైన బ్లాగ్ పేరు కొట్టారు గా, రాయండి!! మీ లో ఎవరికైనా ఆవిడ కనబితే, నా నమస్తే చెప్పండి!
అలా మొదలయ్యిందన్నమాట ఈ గంభోళ జంభ!!

భలె భలే!

నాకు ఇవాళ ఒక కొత్త విషయం తెలిసింది.
ప్రపంచం లో ఏ భాష ఎక్కువమంది మాట్లాడతారో మీకు తెలుసా? ఇంగ్లీష్ కాదండి, చైనీస్.
ఐతే ఈ వ్యాసము చైనీస్ భాష గురించి కాదు. అదే లిస్టు లో ఐదవ స్థానం లో బెంగాలి ఉంది, ఆరవ నెంబర్ లో హిందీ వుంది.
తరువాత. పదిహేడో నెంబర్ లో మన తెలుగు!! అంటే ప్రపంచ వ్యాప్తం గా ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాష (బెంగాలి, హిందీ తరువాత) తెలుగే! ఆ లిస్టు ని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు.
ఇది నాకు భలే అనిపించింది! నిజానికి ఇందులో రెండు విషయాలు నాకు భలే అనిపించాయి - ఒకటి హిందీ కన్నా బెంగాలి ఎక్కువ ప్రాచుర్యం లో ఉండడం, రెండవది దక్షినాది భాషల్లో తెలుగు అగ్రస్థానం లో ఉండడం!
కూడలి వెబ్సైట్ లో ఇన్ని తెలుగు బ్లాగులు చూసి భలే సరదా అనిపించింది! కొన్ని బ్లాగులు ఐతే బుర్ర పాడు!!!!

నా బ్లాగ్ కూడా బుర్ర పాడే, కాని రెండో రకం లో ;) ఎందుకు, ఏమిటి, ఎలా అర్థం కాక బుర్ర పాడు ఇది!!

ఈ బ్లాగ్ మొదలు పెట్టి ఇప్పటికి 24 గంటలు అయ్యింది. నేను పెద్దగా ఎవరితోను చెప్పలేదు, ఎవరిని ఆహ్వానించలేదు. అయినా, ఇప్పటికే 124 మంది వచ్చేరు, చూసారు! మీ అందరికి బోలెడు థాంక్స్!
ఇప్పుడిప్పుడే తెలుగు టైపింగ్ అలవాటు అవుతోంది కదా! In Front, Crocodile Festival!!!!!!

Sunday, April 27, 2008

ఇప్పుడు నిజంగా ఐ పి ఎల్ మొదలయ్యింది!


నిజంగా అవి దెబ్బలు కావు!

నిన్న ఉదయం నా ఇంగ్లీష్ బ్లాగ్ లో డెక్కన్ చార్జర్స్ ఫోటో పెట్టి ఇవాళ వాళ్లు మొదటి మత్చ్ గెలుస్తారు అని రాసాను!
ఆడం గిల్క్రిస్ట్ చలవ వల్ల అది నిజం అయ్యింది!!
ఆహ! కడుపు నిండిపోయింది అనుకోండి! 42 బంతుల్లో 100! నిజంగా ముంబాయి ఇండియన్స్ ముఖాల్లో నెత్తురు లేదంటే నమ్మండి!!
ఐ పి ఎల్ మొదల్లవక ముందే, హైదరాబాద్ టీం అన్నిటికన్నా పటిష్టమైనదని అందరు నమ్మారు! ఐతే దీనికి విరుద్ధం గా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లు కొంచం లో ఓడి అభిమానులని నిరాశ పరిచారు.
ఆ నిరాశ అంత నిన్నటి తో తుడిచి పెట్టుకు పోయింది అనుకోండి!
ఇంతకు ముందు బౌచర్, సెంచరీలు మెరిపించినా నిన్నటి హుందా రాలేదు!
వచ్చే మ్యాచ్ నుండి సైమండ్స్ ఉండడు అని బాధ పడే లోపే అసలైన ప్లేయర్ గిల్క్రిస్ట్ ఫోరం లోకి రావడం భలే ఉంది!
ఇక మొదలు! ఇప్పుడు హైదరాబాద్ టీం కు tournament మొదలయ్యింది!!
నిన్నటి మ్యాచ్ గురించి నా ఇంగ్లీష్ పోస్ట్ ఇక్కడ చదవండి

బ్లాగ్గింగ్ లో కొత్త విధానం

ఇవాళ ఉదయం ఈ బ్లాగ్ తయ్యారు చేసినప్పుడు లేఖిని వాడాను. ఐతే బ్లాగ్ లో పబ్లిష్ చేసిన తరువాత బ్లాగర్ లో ' Type in Indic Languages' అనే లింక్ కనబడింది. ఇది ఇంకా బాగుంది!! గూగుల్ భలే తెలివైన కంపెనీ. దాని తెలివైన Translator ఇంజన్ దానంతట అదే పదాలని కూర్చేస్తుంది. రెండు ఈ లు రెండు ఆ లు టైపు చెయ్యకర్లేదు.
మిగితా వాటిల్లో ఈ అవకాసం ఉందొ లేదు తెలియదు కాని, బ్లాగర్ సూపర్!!!
ఈ లోపే ఒక కొత్త ప్రాబ్లం వచ్చింది.
Firefox లో తెలుగు సరిగ్గా డిస్ప్లే అవ్వటం లేదు! ఐతే www.te.wikipedia.orgలో వెతికితే Firefox ని కొత్త Version కి మార్చుకోమని సలహా ఇచ్చింది.
అప్పుడు గూగుల్ లో వెతికితే దొరికినదే ఈ "Firefox ౩ బీటా5" దానిని మీరు కూడా ఇక్కడ download చేసుకో వచ్చు.
ఇప్పుడు తెలుగు తెలుగులాగా కనబడుతోంది! భలే భలే! :)
ఇక ఖుమ్మేయ్యడమే!

Saturday, April 26, 2008

గంభోళ జంభ

ఆహా ఓహో కత్తి!!
కేక!
గంభోళ జంభ!!
ఊరికే! తెలుగు లో రాయటం భలే సరదాగా ఉంది!! ఎప్పుడో ఇంటర్ లో రాసిన తెలుగు. మళ్ళీ ఇలా ఇంటెర్నెట్ లొ రాస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు.
లేఖిని కి థాంక్స్! (www.lekhini.org)

అంతం కాదిది ఆరంభం!

ఆదిత్య